ఎస్టీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాం
రిజర్వేషన్ల పెంపు, విద్య, వ్యవసాయం, ఉపాధికి ప్రాధాన్యం -ఎమ్మెల్యే చింత ప్రభాకర్

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 17 ( రథసారథి న్యూస్): గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసినట్లు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తెలిపారు. ఎస్టీల విద్య, ఉపాధి, వ్యవసాయం, మౌలిక వసతులతో పాటు మహిళా సాధికారత, సామాజిక, రాజకీయ రంగాల్లో అవకాశాల కల్పనకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. కొండాపూర్ మండలం శివన్నగూడెం తండా, తమ్మలి భాయ్ తండాల్లో బీఆర్ఎస్ నాయకులు, గిరిజనులతో కలిసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గిరిజనుల సమగ్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు.
-ప్రత్యేక అభివృద్ధి నిధులతో కేటాయింపులు
ఎస్టీల అభివృద్ధి కోసం ప్రత్యేక అభివృద్ధి నిధిని చట్టబద్ధం చేసి భారీగా నిధులు కేటాయించినట్లు చింత ప్రభాకర్ తెలిపారు. 2022–23లో రూ.13,412.63 కోట్లు, 2023–24లో రూ.15,232.62 కోట్లు కేటాయించినట్లు వివరించారు. ఎస్టీల అభివృద్ధికి కేటాయించిన నిధులను విద్య, వ్యవసాయం, మౌలిక వసతులు, సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించినట్లు పేర్కొన్నారు.
-10 శాతానికి ఎస్టీ రిజర్వేషన్లు
గిరిజనులకు విద్య, ఉద్యోగాల్లో మరింత ప్రాతినిధ్యం కల్పించే ఉద్దేశంతో ఎస్టీ రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ 2022లో నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ నిర్ణయం గిరిజనులకు విద్య, ఉపాధి అవకాశాల విస్తరణకు దోహదపడుతుందని పేర్కొన్నారు.
-గిరిజన భూములను సాగులోకి తీసుకొచ్చాం
గిరిజన రైతుల బంజరు, సాగుకు అనుకూలంగా లేని భూములను సాగులోకి తీసుకురావడానికి గిరి వికాసం పథకాన్ని అమలు చేసినట్లు చింత ప్రభాకర్ తెలిపారు. 2022 డిసెంబర్ నాటికి 19,698 మంది ఎస్టీ రైతులకు చెందిన 56,613 ఎకరాల భూమిని సాగులోకి తీసుకొచ్చినట్లు వివరించారు.
-విద్యకు ప్రాధాన్యం
గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, ఉన్నత విద్యకు శిక్షణ, ఉపకార వేతనాలు తదితర కార్యక్రమాలను అమలు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రంలో గిరిజన విద్యార్థుల కోసం ప్రత్యేక గురుకుల విద్యా సంస్థలను ఏర్పాటు చేసి ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించినట్లు పేర్కొన్నారు.
-మౌలిక వసతులు, ఉపాధికి ప్రోత్సాహం
గిరిజన ఆవాసాల్లో రహదారులు, విద్యుత్, తాగునీరు తదితర మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు చింత ప్రభాకర్ తెలిపారు. గిరిజన యువతకు స్వయం ఉపాధి, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వివిధ శిక్షణ, ఆర్థిక సహాయ కార్యక్రమాలను అమలు చేసినట్లు పేర్కొన్నారు. గిరిజన మహిళలు స్వయం ఉపాధి, పారిశ్రామిక రంగాల్లో ముందుకు సాగేందుకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలను ప్రోత్సహించినట్లు తెలిపారు.
-కాంగ్రెస్ హామీల అమలుపై ప్రశ్నలు
కాంగ్రెస్ పార్టీ 2023లో ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో పేర్కొన్న హామీల అమలుపై ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రశ్నలు లేవనెత్తారు. గిరిజన కార్పొరేషన్లు, సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థలు, సమగ్ర గిరిజన అభివృద్ధి పథకం, ప్రతి మండలంలో ఎస్సీ, ఎస్టీ వసతి పాఠశాలల ఏర్పాటు వంటి హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. గిరిజనుల అభివృద్ధికి ఇచ్చిన హామీలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గిరిజన సంక్షేమం, అభివృద్ధి కోసం బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందని చింత ప్రభాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ ఉపాధ్యక్షుడు పట్నం మాణిక్యం, మాజీ సీడీసీ చైర్మన్లు కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్‌రెడ్డి, డాక్టర్ శ్రీహరి, మాజీ జెడ్పీటీసీ కొండల్‌రెడ్డి, మనోహర్‌గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు విఠల్, చక్రపాణి, రామప్ప, కౌన్సిలర్లు, సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, గిరిజనులు తదితరులు పాల్గొన్నారు.



