Sangareddy

ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఆరుతడి పంటలను ప్రోత్సహించాలి

ఆగస్టు నెలాఖరులోగా విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందించాలి : జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 24 (రథసారథి న్యూస్):

ఎల్‌నినో ప్రభావంతో ఈ ఖరీఫ్‌ సీజన్‌లో వర్షపాతం తక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో రైతులు ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మళ్లేలా వ్యవసాయ శాఖ అధికారులు విస్తృత అవగాహన కల్పించి ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. అలాగే ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులకు రెండు జతల ఏకరూప దుస్తులను కుట్టించి ఆగస్టు నెలాఖరులోగా అందజేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఏకరూప దుస్తుల పంపిణీ, ఎల్‌నినో ప్రభావం, వర్షపాతం పరిస్థితులు, ఖరీఫ్‌ పంటల సాగు తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆగస్టు నెలాఖరులోగా రెండు జతల యూనిఫాంలను అందజేయాలని ఆదేశించారు. అలాగే ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు మండలాల వారీగా విత్తన మేళాలను నిర్వహించి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని సూచించారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు యూనిఫాంల కుట్టింపునకు అవసరమైన వస్త్రాలు, ఇతర సామగ్రిని సకాలంలో అందజేయాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏకరూప దుస్తులు పంపిణీ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. మండలాల వారీగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య, అవసరమైన యూనిఫాంల వివరాలను సమీక్షించారు.

జిల్లాలో ఎల్‌నినో ప్రభావంపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, నీటి లభ్యతకు అనుగుణంగా ఆరుతడి పంటలు, ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. క్రాప్‌ డైవర్సిఫికేషన్‌కు అవసరమైన విత్తనాలు రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో భవిష్యత్తులో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు కార్యాచరణ చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించిన కలెక్టర్, ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో కార్యాచరణ ప్రణాళికను అమలు చేసి రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పాండు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button