Sangareddy

పోలీసు సిబ్బందికి కంప్యూటర్ నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ

వృత్తిపరమైన సామర్థ్యాల పెంపునకు సాంకేతిక పరిజ్ఞానం అవసరం -అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి -శిక్షణ పూర్తి చేసిన రెండో బ్యాచ్ సిబ్బందికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ల ప్రదానం

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 24 (రథసారథి న్యూస్):

జిల్లా పోలీసు సిబ్బందిలో వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించేందుకు వోక్సెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కంప్యూటర్ శిక్షణ కార్యక్రమం రెండో బ్యాచ్ ముగింపు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్న పోలీసు సిబ్బందికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేశారు.

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ, ఆధునిక పోలీసింగ్‌లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి పోలీసు సిబ్బంది కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు ఆధునిక సాఫ్ట్‌వేర్‌లపై పూర్తి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ఎంఎస్ ఆఫీస్‌లోని వర్డ్, ఎక్సెల్ వంటి సాఫ్ట్‌వేర్‌లలో ప్రావీణ్యం పెంపొందించుకోవడం ద్వారా కార్యాలయ పనితీరులో వేగం, ఖచ్చితత్వం, సమర్థత మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు.

జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది, పోలీసు స్టేషన్ల రైటర్లు, సైబర్ వారియర్స్, టెక్ టీమ్ సిబ్బంది కలిపి మొత్తం 180 మందికి మూడు బ్యాచ్‌లుగా విభజించి, ప్రతి బ్యాచ్‌కు మూడు రోజుల పాటు శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను రోజువారీ విధుల్లో సమర్థవంతంగా వినియోగించుకోవాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని పనితీరు మెరుగుదలకు సాధనంగా మలుచుకోవాలని సూచించారు. పోలీసు శాఖ సేవల నాణ్యతను పెంచడంలో ఇటువంటి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.

శిక్షణ కార్యక్రమం నిర్వహణలో సహకరించిన వోక్సెన్ యూనివర్సిటీ యాజమాన్యం, అధ్యాపకులకు పోలీసు శాఖ తరఫున అదనపు ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వోక్సెన్ యూనివర్సిటీ డీన్ డాక్టర్ దయాశంకర్, అసిస్టెంట్ డీన్లు, అధ్యాపకులు, జిల్లా పోలీసు అధికారులు, శిక్షణ పొందిన పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button