చికిత్స పొందుతూ రోగి మృతి.. ప్రైవేటు ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన
వైద్య నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణలు.. గుండెపోటుతోనే మరణించారని ఆసుపత్రి వివరణ

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 24 (రథసారథి న్యూస్):
కడుపు నొప్పి, అల్సర్ సమస్యతో చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటన శుక్రవారం సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చోటుచేసుకుంది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కొయ్యగొండ తండా సాలెబత్పూర్ గ్రామానికి చెందిన పూల్య సింగ్ (50) ఈ నెల 23వ తేదీ రాత్రి కడుపు నొప్పి, అల్సర్ సమస్యతో ఆసుపత్రిలో చేరారు.
వైద్యులు చికిత్స అందిస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున ఆయన మృతి చెందారు. దీంతో మృతుడి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టి, సాధారణ అల్సర్ సమస్యతో చికిత్స కోసం వచ్చిన వ్యక్తి మరణించడం అనుమానాస్పదమని, వైద్య నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బంధువులను శాంతింపజేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
అయితే రోగికి చికిత్స కొనసాగుతున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతోనే ఆయన మరణించారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఘటనపై పూర్తి వివరాలు, మరణానికి గల కారణాలు అధికారిక విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.


