ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తి అరెస్ట్
జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ ఫిర్యాదుతో కేసు నమోదు.. నిందితుడికి రిమాండ్

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 24 (రథసారథి న్యూస్):
జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది విధులకు ఆటంకం కలిగిస్తూ, అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలు చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం, మునిపల్లి మండలం బొడ్పల్లి గ్రామానికి చెందిన మహ్మద్ చాంద్ పాషా (51), ప్రస్తుతం జహీరాబాద్ పట్టణంలోని మూసానగర్లో నివాసం ఉంటున్నారు.
తన భార్య చికిత్స కోసం ఇటీవల జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ సమయంలో ఆసుపత్రి సిబ్బంది, రోగుల ఫోటోలు, వీడియోలను అనుమతి లేకుండా చిత్రీకరించడం, వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడం, అలాగే సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ వైద్యులు, నర్సులు, సిబ్బందిపై ఆరోపణలు చేయడం ద్వారా విధులకు ఆటంకం కలిగించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ (ఆర్ఎంఓ) డాక్టర్ ఎం. మానస ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా శుక్రవారం మహ్మద్ చాంద్ పాషాను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరిస్తూ, మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులు లేదా ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


