పోక్సో కేసు భయంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణ
భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 24 (రథసారథి న్యూస్):
సంగారెడ్డి మండలంలోని ఎర్ధనూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడు ఉరివేసుకుని మృతి చెందిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఎర్ధనూర్ గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల నవీన్ కుమార్ (27), వృత్తిరీత్యా పెయింటర్, గురువారం రాత్రి ఇంట్లోని దూలానికి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిపై 2022లో నర్సాపూర్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదై ఉన్నట్లు సమాచారం.
ఇటీవల ఆ కేసు విచారణకు హాజరు కాలేకపోవడంతో తనకు శిక్ష పడుతుందేమోననే భయంతో మనస్తాపానికి గురై ఈ ఘాతుకానికి పాల్పడినట్లు మృతుడి భార్య శ్వేత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడి మృతికి గల పూర్తి కారణాలపై విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.


