Sangareddy

నీట్ పేపర్ లీకేజీపై పోరాటం కొనసాగుతుంది: జగ్గారెడ్డి

-ఇందిరా, రాజీవ్ దేశం కోసం ప్రాణత్యాగం చేశారు.. బీజేపీలో అలాంటి నాయకుడు ఎవరున్నారో చెప్పాలి

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 23 (రథసారథి న్యూస్): నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు కొనసాగిస్తుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు సంఘీభావంగా సంగారెడ్డిలో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి బ్లాక్ టీ-షర్టులు ధరించి పాదయాత్ర నిర్వహించిన ఆయన అనంతరం మాట్లాడుతూ, నీట్ ప్రశ్నపత్రం లీకేజీ కారణంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. పరీక్ష రాసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆవేదనను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. సంగారెడ్డికి చెందిన ఓ విద్యార్థిని మొదటి ప్రయత్నంలో 444 మార్కులు సాధించగా, రెండోసారి 386 మార్కులు రావడంతో అర్హత కోల్పోయిందని పేర్కొంటూ, ఇందుకు బాధ్యత ఎవరు వహిస్తారో ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

నీట్ వ్యవహారంపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై ఢిల్లీలో లాఠీచార్జి చేయడం దురదృష్టకరమని, అందుకే కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు నిరసన కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. దేశం కోసం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీలు ప్రాణత్యాగాలు చేశారని, అలాంటి త్యాగం చేసిన నాయకులు బీజేపీలో ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. ప్రధాని పదవిని సోనియా గాంధీ స్వచ్ఛందంగా వదులుకుని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను ప్రధానిగా చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ పదవుల కోసం కాకుండా ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న నాయకుడని కొనియాడారు.

నీట్ పేపర్ లీకేజీ ఘటనపై ప్రధాని మోదీ దేశ విద్యార్థులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. విద్యార్థులకు పూర్తి న్యాయం జరిగే వరకు సంగారెడ్డిలో వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button