సంగారెడ్డి, జహీరాబాద్ అభివృద్ధికి కేంద్ర సహకారం కోరిన ఎమ్మెల్యేలు
-బుల్లెట్ ట్రైన్ స్టేషన్, రేక్ పాయింట్ ఏర్పాటుకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌కు వినతిపత్రం

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 23 (రథసారథి న్యూస్): సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం అందించాలని కోరుతూ సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు పార్లమెంటరీ బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్రతో కలిసి కేంద్ర రైల్వే, సమాచార ప్రసారాలు, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను న్యూఢిల్లీలో కలిసి వినతిపత్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రతిపాదిత ముంబై–హైదరాబాద్ హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్‌లో సంగారెడ్డిలో బుల్లెట్ ట్రైన్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్‌కు సమీపంలోని వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లా కేంద్రంగా సంగారెడ్డిలో ఐఐటీ హైదరాబాద్, ప్రభుత్వ వైద్య కళాశాల, ఔషధ పరిశ్రమలు, జాతీయ రహదారులు, రీజినల్ రింగ్ రోడ్ వంటి కీలక మౌలిక వసతులు ఉన్నాయని, ఇక్కడ బుల్లెట్ ట్రైన్ స్టేషన్ ఏర్పాటు చేస్తే లక్షలాది మందికి ప్రయోజనం చేకూరుతుందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు జహీరాబాద్ రైల్వే స్టేషన్లో రైల్వే రేక్ పాయింట్ ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. రేక్ పాయింట్ ఏర్పాటుతో వ్యవసాయ ఉత్పత్తులు, ఎరువులు, ధాన్యం, సిమెంట్, ఉక్కు, ఆటోమొబైల్ ఉత్పత్తుల రవాణా సులభతరం కావడంతో పాటు రవాణా వ్యయాలు తగ్గి రైతులు, వ్యాపారులు, పరిశ్రమలకు మేలు జరుగుతుందని వివరించారు. అలాగే హైదరాబాద్–ముంబై బుల్లెట్ ట్రైన్ కారిడార్ డీపీఆర్‌లో జహీరాబాద్ రైల్వే స్టేషన్‌ను చేర్చి, అక్కడ బుల్లెట్ ట్రైన్ స్టాప్ ఏర్పాటు చేయాలని కోరారు.
నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ (ఎన్ఐఎమ్జెడ్), ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ వంటి భారీ పారిశ్రామిక ప్రాజెక్టులు అమలవుతున్న నేపథ్యంలో జహీరాబాద్‌కు ప్రపంచ స్థాయి రవాణా సౌకర్యాలు అవసరమని పేర్కొన్నారు. వినతిపత్రాలను స్వీకరించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.



