ఎస్సీలకు 15 శాతం రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయాలి
జిల్లా అదనపు కలెక్టర్‌కు బీజేపీ ఎస్సీ మోర్చా వినతిపత్రం

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 24 (రథసారథి న్యూస్):
రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో ఎస్సీ అభ్యర్థులకు 15 శాతం రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతి కిరణ్ సూచన మేరకు సంగారెడ్డి జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు చంటి ప్రభు నేతృత్వంలో ఈ వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ జనాభా ఆధారంగా రాజకీయ రిజర్వేషన్లు అమలు చేసినప్పటికీ, 2026లో కూడా అదే విధానాన్ని కొనసాగించడం వల్ల ఎస్సీ సమాజానికి అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. రాజ్యాంగం సామాజిక న్యాయం, సమానత్వం, బలహీన వర్గాల సాధికారతను ప్రధాన లక్ష్యాలుగా నిర్దేశించిందని గుర్తు చేశారు.
ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానానికి అనుగుణంగా రాజకీయ రంగంలో కూడా ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్లు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఎస్సీ జనాభాకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా వారి సమస్యలు ప్రజాప్రతినిధుల ద్వారా ప్రభుత్వ దృష్టికి మరింత సమర్థవంతంగా చేరుతాయని, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా సామాజిక న్యాయం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో జరిగే అన్ని ఎన్నికల్లో ఎస్సీలకు 15 శాతం రాజకీయ రిజర్వేషన్లు అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి అశ్వంత్, బీజేపీ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్లయ్య, న్యాయవాదులు చంటి దేవిక, కలాలి వినోద్ కుమార్, శివ తదితరులు పాల్గొన్నారు.


