Uncategorized

ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

సంగారెడ్డి–జహీరాబాద్ సమగ్ర అభివృద్ధికి పలు వినతులు

ఎన్‌హెచ్-65పై ఫ్లైఓవర్లు, మంజీరా ఎకో టూరిజం, వారసత్వ కట్టడాల అభివృద్ధికి ప్రతిపాదనలు

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 24 (రథసారథి న్యూస్):

సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరుతూ బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు శుక్రవారం న్యూఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసి వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన వినతిపత్రాలు సమర్పించారు.

పార్లమెంట్ ప్రాంగణంలోని వారి కార్యాలయాల్లో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌లను వేర్వేరుగా కలిసి నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించిన అంశాలను వివరించారు. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన సందర్భంగా సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలోని జాతీయ రహదారి–65పై నిజాంపూర్ ఎక్స్‌రోడ్, ఆరూర్ జంక్షన్ల వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా అక్కడ తక్షణమే ఫ్లైఓవర్లు (గ్రేడ్ సెపరేటర్లు) నిర్మించాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.

ఈ కూడళ్ల ద్వారా పరిసర గ్రామాలకు భారీ స్థాయిలో రాకపోకలు సాగుతున్నాయని, ట్రాఫిక్ రద్దీ రోజురోజుకు పెరుగుతోందని వివరించారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిసి సంగారెడ్డి మండలంలోని కలబ్‌గూర్, సదాశివపేట మండలంలోని నందికంది గ్రామాల్లోని 11వ శతాబ్దానికి చెందిన ప్రాచీన దేవాలయాలను వారసత్వ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని కోరారు.

ఈ ఆలయాల వద్ద అప్రోచ్ రోడ్లు, పార్కింగ్, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సదుపాయాలు, ల్యాండ్‌స్కేపింగ్, చారిత్రక సమాచార బోర్డులు ఏర్పాటు చేసి కేంద్ర వారసత్వ పర్యాటక పథకాల కింద ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అదే సందర్భంగా సంగారెడ్డి నియోజకవర్గంలోని కొండాపూర్ పురావస్తు మ్యూజియాన్ని ఆధునీకరించి జాతీయ స్థాయి వారసత్వ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని మరో వినతిపత్రాన్ని సమర్పించారు. శాతవాహన కాలానికి చెందిన అమూల్యమైన పురావస్తు సంపదను సంరక్షిస్తున్న ఈ మ్యూజియంలో డిజిటల్ గ్యాలరీలు, ఇంటరాక్టివ్ ప్రదర్శనలు, లైట్ అండ్ సౌండ్ షో, సందర్శకుల కేంద్రం, పరిశోధన, విద్యా కేంద్రాలు, హస్తకళల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసి హెరిటేజ్ టూరిజం సర్క్యూట్‌లో చేర్చాలని కోరారు.

కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కలిసి సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు కీలక జలవనరైన మంజీరా డ్యాంను కేంద్ర ప్రభుత్వ ‘అమృత్ ధరోహర్’ పథకం కింద జాతీయ స్థాయి ఎకో-టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. మంజీరా వన్యప్రాణి అభయారణ్యం వందలాది పక్షి జాతులకు, వలస పక్షులకు నిలయంగా ఉందని వివరించిన ఎమ్మెల్యేలు, బర్డ్ వాచింగ్ టవర్లు, నేచర్ ఇంటర్‌ప్రిటేషన్ సెంటర్, పర్యావరణ హిత బోటింగ్, సైక్లింగ్, వాకింగ్ ట్రాక్‌లు, క్యాంపింగ్ కాటేజీలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

అలాగే మంజీరా వెట్‌ల్యాండ్‌కు ప్రతిష్టాత్మక ‘రామ్‌సార్’ గుర్తింపు కల్పించాలని కోరారు. ప్రజల భద్రత, చారిత్రక వారసత్వ పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, పర్యాటక అభివృద్ధికి సంబంధించిన ఈ ప్రతిపాదనలను కేంద్ర మంత్రులు సానుకూలంగా స్వీకరించి, సంబంధిత అంశాలను పరిశీలించి వీలైనంత త్వరగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button