ఆగస్టు 10లోగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తి
-17న ముసాయిదా ఓటరు జాబితా విడుదల –సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాల స్వీకరణ –అడిషనల్ కలెక్టర్ సంగీత

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 7 (రథసారథి న్యూస్): భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్ సంగీత తెలిపారు.
ఆగస్టు 10లోగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌తో పాటు పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం సంగారెడ్డి కలెక్టరేట్‌లోని మినీ మీటింగ్ హాల్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణకు భారత ఎన్నికల సంఘం గడువు పొడిగించడంతో ప్రక్రియను పూర్తి చేసేందుకు అదనపు సమయం లభించిందని పేర్కొన్నారు.
ఆగస్టు 17న ముసాయిదా ఓటరు జాబితాను (డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్) విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఆ జాబితాపై ఏవైనా క్లెయిమ్స్ లేదా అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు సంబంధిత అధికారులకు సమర్పించవచ్చని చెప్పారు. అందిన దరఖాస్తులను ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏఎస్‌డీ జాబితాలను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి రెండు రోజుల్లోగా ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం 1,200కు పైగా ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన చోట కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు రేషనలైజేషన్ చేపట్టినట్లు తెలిపారు.
ప్రస్తుతం జిల్లాలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో 1,633 పోలింగ్ కేంద్రాలు ఉండగా, రేషనలైజేషన్ అనంతరం 1,649 పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించినట్లు వెల్లడించారు. దీంతో జిల్లాలో కొత్తగా 16 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుకానున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ సగటున 79 శాతం పూర్తయిందని పేర్కొన్నారు. నియోజకవర్గాల వారీగా నారాయణఖేడ్‌లో 88 శాతం, ఆందోల్‌లో 87 శాతం, జహీరాబాద్‌లో 82 శాతం, సంగారెడ్డిలో 80 శాతం, పటాన్‌చెరులో 67 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని వివరించారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసేందుకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా చురుకైన సహకారం అందించాలని అడిషనల్ కలెక్టర్ సంగీత కోరారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ పాండు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల శాఖ అధికారులు పాల్గొన్నారు.



