Uncategorized

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పు –దర్యాప్తు అధికారులను అభినందించిన అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 24 (రథసారథి న్యూస్):

సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడికి సంగారెడ్డి ప్రత్యేక పోక్సో (ఫాస్ట్ ట్రాక్ స్పెషల్) కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. ప్రత్యేక పోక్సో న్యాయమూర్తి ఆర్. శ్రీలేఖ నిందితుడు మహమ్మద్ కలీం పాషా అలియాస్ నవీద్ (25), సదాశివపేటను దోషిగా నిర్ధారిస్తూ 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో రెండు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించారు.

పోలీసుల వివరాల ప్రకారం, ఈ ఘటనపై సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 65(2)తో పాటు పోక్సో చట్టం–2012లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో సేకరించిన పటిష్టమైన సాక్ష్యాధారాలు, కోర్టులో సమర్థవంతంగా సమర్పించిన ఆధారాల మేరకు నిందితుడికి శిక్ష పడింది.

ఈ కేసులో సమర్థవంతంగా వాదనలు వినిపించిన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి. సుర్‌రెడ్డి, బాధితురాలికి న్యాయ సహాయం అందించిన భరోసా కేంద్రం లీగల్ కౌన్సిలర్ ఎస్. అపర్ణ, దర్యాప్తు నిర్వహించిన అప్పటి ఎస్‌ఐ పి. రవీందర్, అప్పటి సీఐ ఎస్. క్రాంతి కుమార్, ప్రస్తుతం సంగారెడ్డి రూరల్ ఎస్‌హెచ్‌ఓ ఎస్. మధుసూదన్ రెడ్డి, కోర్టు లైజనింగ్ అధికారులు, సిబ్బంది కృషిని జిల్లా అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి అభినందించారు. సమర్థవంతమైన దర్యాప్తు, పకడ్బందీ సాక్ష్యాధారాల సమర్పణ వల్లే నిందితుడికి శిక్ష పడిందని ఆయన పేర్కొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button